వాట్సాప్ డబ్బులు ఎలా సంపాదిస్తుందో తెలుసా..?

          

వాట్సాప్.. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది. వెబ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్.. తదితర ప్లాట్‌ఫాంలపై వాట్సాప్ సేవలు మనకు లభిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ప్రథమ స్థానంలో ఉంది. ఇప్పటికే దీన్ని వాడుతున్న వారి సంఖ్య 100 కోట్లు దాటింది. అయితే వాట్సాప్ మొదట వచ్చినప్పుడు మొదటి సంవత్సరం ఉచితంగా అందించారు. తరువాత ఏడాదికి 1 డాలర్ ఫీజు అన్నారు. తరువాత ఫేస్‌బుక్ వాట్సాప్‌ను కొనుగోలు చేసింది. అనంతరం ఆ 1 డాలర్ ఫీజును కూడా తీసేశారు. అప్పటి నుంచి ఫేస్‌బుక్ ఆధ్వర్యంలో వాట్సాప్ నడుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఆ యాప్‌లో ఎలాంటి యాడ్స్ లేవు. మరోవైపు దాన్ని ఎలాంటి ఫీజు లేకుండానే యూజర్లకు ఉచితంగా అందిస్తున్నారు. మరి.. యాడ్స్ పెట్టక, ఫీజు వసూలు చేయక ఫేస్‌బుక్ వాట్సాప్‌ను ఉచితంగా ఎలా నడపగలుగుతోంది..? ఎప్పుడైనా ఆలోచించారా..? ఇక వాట్సాప్ వల్ల ఫేస్‌బుక్ ఎంత డబ్బు సంపాదిస్తుంది..? అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా..? అయితే నిజానికి ఇప్పటికీ వాట్సాప్ వల్ల ఫేస్‌బుక్‌కు డబ్బులు ఏమీ రావడం లేదు. ఉచితంగానే సేవలను అందిస్తున్నది. కానీ త్వరలోనే ఈ యాప్ సహాయంతో పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించే దిశగా ఫేస్‌బుక్ ప్రయత్నాలు చేస్తున్నది. అవేమిటంటే...

1. యాడ్స్

వాట్సాప్‌లో త్వరలో యాడ్స్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. యూజర్లు చాటింగ్ చేసేటప్పుడు, వాయిస్, వీడియో కాల్స్ చేసేటప్పుడు యాడ్స్ వచ్చేలా కొత్తగా ఆ యాప్‌ను డిజైన్ చేయనున్నారట. దీని ద్వారా వాట్సాప్‌లో డబ్బులు సంపాదించాలని ఫేస్‌బుక్ ఆలోచిస్తున్నది. అంటే.. రానున్న రోజుల్లో మనం వాట్సాప్‌లో యాడ్స్ చూస్తామన్నమాట.

2. బిజినెస్ ఎడిషన్

వాట్సాప్ యాప్‌కు గాను త్వరలో బిజినెస్ ఫ్రెండ్లీ వెర్షన్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఇది కార్పొరేట్ కంపెనీలకు అందుబాటులో ఉంటుంది. వారు తమ కస్టమర్లకు వాట్సాప్ ద్వారా కనెక్ట్ కావడానికి బిజినెస్ ఫ్రెండ్లీ వాట్సాప్ వెర్షన్ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆయా కంపెనీలు ఈ వెర్షన్ వాట్సాప్‌ను వాడుకున్నందుకు గాను వాట్సాప్‌కు డబ్బులు చెల్లిస్తాయి. అలా వాట్సాప్ ద్వారా ఫేస్‌బుక్ ఆదాయాన్ని ఆర్జించబోతున్నది.

3. వాట్సాప్ పే

 దేశంలో నోట్ల రద్దు ప్రభావంతో డిజిటల్ వాలెట్లలో లావాదేవీలు ఏ విధంగా పెరిగాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక కంపెనీలు కొత్త కొత్త వాలెట్ యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా తేజ్ పేరిట ఓ కొత్త వాలెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే చైనాకు చెందిన వీచాట్ అనే మెసేజింగ్ యాప్‌లో కూడా వీపే అనే వాలెట్ లభిస్తున్నది. ఈ క్రమంలోనే వాట్సాప్ కూడా వాట్సాప్ పే అనే డిజిటల్ వాలెట్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. దీని ద్వారా యూజర్లకు నగదు ట్రాన్స్‌ఫర్, ఆన్‌లైన్ షాపింగ్, బిల్ పేమెంట్స్ వంటి సేవలను అందిస్తూ మరోవైపు డబ్బు సంపాదించాలని వాట్సాప్ ఆలోచిస్తున్నది. 

పైన చెప్పిన మూడు విధాలుగా వాట్సాప్ త్వరలో ఆదాయాన్ని ఆర్జించనుంది. ఇక వాట్సాప్ లెక్కల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా యూజర్లు వాడుతున్నారు. నెలకు 130 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఇందులో ఉంటున్నారు. రోజుకు 20 కోట్ల వాయిస్ మెసేజ్‌లను వాట్సాప్‌లో పంపుకుంటున్నారు. వారానికి యావరేజ్‌గా ఒక యూజర్ 195 నిమిషాల పాటు వాట్సాప్‌లో వాయిస్ కాల్స్ చేసుకుంటున్నాడు. అలాగే ఒక యూజర్ నెలకు యావరేజ్‌గా వాట్సాప్‌లో 1200 మెసేజ్‌లను పంపుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌లో రోజూ 5500 కోట్ల మెసేజ్‌లను పంపుకుంటున్నారు.

No comments

Powered by Blogger.