రూ.1,649కే ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌

దిల్లీ: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌, ప్రముఖ బడ్జెట్‌ ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ సంయుక్తంగా అతి తక్కువ ధరకే రెండు 4జీ స్మార్ట్‌ఫోన్‌లను భారత విపణిలోకి విడుదల చేసింది. జియో ఫీచర్‌ ఫోన్‌కు పోటీగా అతి తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చింది. రూ.1,649కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ‘ఆక్వా ఏ4’, ‘ఆక్వా ఎస్‌3’ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ.1,999, రూ.4,379గా ఉన్నాయి.
‘మేరా పెహ్ల స్మార్ట్‌ఫోన్‌’ పేరుతో ఎయిర్‌టెల్‌.. సెల్‌కాన్‌, కార్బన్‌తో భాగస్వామ్యంగా ఏర్పడిన విషయం తెలిసిందే. దీన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇందులో ఇంటెక్స్‌ను కూడా భాగస్వామిగా చేసుకున్నట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ రెండు ఫోన్లతో పాటు ఇంటెక్స్‌ ఆక్వా లయన్స్‌ ఎన్‌1(మార్కెట్‌ ధర రూ.3,799) ఫోన్‌ను తీసుకొచ్చింది. 4 అంగుళాల తాకే తెర, 1జీబీ ర్యామ్‌, 8జీబీ అంతర్గత మెమరీ(128జీబీ వరకు పెంచుకునే సదుపాయం), 2ఎంపీ వెనుక కెమెరా వీజీఏ ఫ్రంట్‌ కెమెరా సదుపాయాలతో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది.
డౌన్‌పేమెంట్‌ కింద ఈ ఫోన్‌ రూ.3,149కే లభ్యం కానుంది. క్యాష్‌ బ్యాక్‌(రూ.1500) కింద రూ.1,649కే వినియోగదారుడికి ఈ ఫోన్‌ అందుబాటులోకి వస్తుంది. రీఫండ్‌ పొందాలంటే నెలకు రూ.169రీఛార్జి చొప్పున 36నెలల పాటు చేయించాల్సి ఉంటుంది. అలా చేస్తే వినియోగదారులకు మొదటి 18 నెలలు రూ.500క్యాష్‌ రీఫండ్‌, మరో 18నెలలు తర్వాత వెయ్యి రూపాయలు రీఫండ్‌ కింద వస్తుంది. 36నెలలు పూర్తయితే.. వినియోగదారులు మొత్తం రూ.1500 క్యాష్‌ పొందినట్లు అవుతుంది.
ఒకవేళ వినియోగదారులు రూ.169తో రీఛార్జి చేసుకోకపోతే.. మొదటి 18నెలలు రూ.3వేలు విలువ చేసే రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు రూ.500 రీఫండ్‌ పొందవచ్చు. అలాగే తదుపరి 18నెలలు కూడా రూ.3వేల విలువైన రీఛార్జిలు చేసుకుంటే రూ.1000 రీఫండ్‌ పొందుతారు. ఇంటెక్స్‌ ఆక్వా ఏ4 రూ.4999కాగా.. రూ.1,999కే అందిస్తోంది. 1.3గిగా హెడ్జ్‌ ప్రొసెసర్‌, 1జీబీ ర్యామ్‌, 8జీబీ అంతర్గత మెమరీ(64జీబీ వరకు పెంచుకునే సదుపాయం), 5ఎంపీ వెనుక, 2ఎంపీ ముందు కెమెరా సదుపాయాలు ఉన్నాయి.
ఆక్వా ఎస్‌ 3 మార్కెట్‌ ధర రూ.6,649కాగా రూ.4,379కే లభించనుంది. 5అంగుళాల తాకె తెర, 1.3గిగా హెడ్జ్‌ ప్రొసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 16జీబీ అంతర్గత మెమరీ(64జీబీ వరకు పెంచుకునే సదుపాయం), 8ఎంపీ వెనుక, 5ఎంపీ ముందు కెమెరా, 2450ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం. ఇటీవల ఎయిర్‌టెల్‌, కార్బన్‌ మొబైల్స్‌ సంయుక్తంగా రూ.1,849కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

No comments

Powered by Blogger.