వాయిస్‌ కాల్స్‌పై జియో షాక్‌





జియో సిమ్‌ ఉంటే చాలు.. ఎన్ని నిమిషాలైనా, ఎన్ని గంటలైనా అలా ఎన్ని రోజులైనా అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ఇది ఇప్పడి వరకున్న ట్రెండ్‌. ప్రస్తుతం జియో తన కస్టమర్లకు షాకిస్తోంది. అదీ అందరికీ కాదు. కొందరికి మాత్రమే. వాయిస్‌ కాల్స్‌ను ఇబ్బడిముబ్బడిగా వాడేసే కస్టమర్లకు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ ఫీచర్‌ను పరిమితం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. 


వాయిస్‌ఓవర్‌ను వాడుకుంటూ తమ నెట్‌వర్క్‌పై కేవలం రోజుకు 300 నిమిషాల కాల్స్‌ను మాత్రమే వాడుకునేలా జియో నిబంధన పెట్టబోతున్నట్టు రిపోర్టులు తెలిపాయి. అపరిమిత కాల్స్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే నేపథ్యంలో ఈ కాల్స్‌ను పరిమితం చేస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. టెలికాంటాక్‌కు జియో ప్రియారిటీ టీమ్‌ ఈ విషయాన్ని నిర్థారించిందట. కొందరు యూజర్లకు రోజుకు 300 నిమిషాల వాయిస్‌ కాల్స్‌ను మాత్రమే జియో పరిమితం చేస్తుందని, జియో అపరిమిత కాల్స్‌ ఫీచర్‌తో కొందరు యూజర్లు రోజుకు 10 గంటలకు పైగా వాడుకుంటూ.. ఆ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా రిపోర్టు వెల్లడించింది. కస్టమర్లకు అందాల్సిన సేవలు పక్కదారి పడుతున్నాయని జియో గుర్తించినట్టు రిపోర్టు చేసింది. ఇలా పరిమితం చేస్తున్న వాయిస్‌ కాల్స్‌ను రోజూ పాటించాలని చూస్తుందని పేర్కొంది. 

4జీ డేటా వాడకం లాగానే వాయిస్‌ కాల్స్‌పైనా పరిమితి తెస్తున్నట్టు రిపోర్టు వెల్లడించింది. 2016 సెప్టెంబర్‌లో జియో సేవలు లాంచ్‌ అయినప్పుడు, అపరిమిత 4జీ డేటాను ఆఫర్‌ చేసింది. అనంతరం డేటా వాడకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించిన జియో, తరువాత డేటా వాడకంపై పరిమితి పెట్టింది. ప్రస్తుతం రోజుకు 1జీబీ డేటానే ఆఫర్‌ చేస్తోంది. అపరిమిత డేటా వాడకం ఉన్నప్పటికీ, 1జీబీ డేటా వాడకం అయిపోయిన తర్వాత డేటా స్పీడు 100 కేబీపీఎస్‌ కంటే పడిపోయింది. అయితే ప్రస్తుతం వాయిస్‌ కాల్స్‌పై పెడుతున్న పరిమితి కొందరు యూజర్లకేనని తెలిసింది. అది కూడా జియో నెట్‌వర్క్‌ను దుర్వినియోగం చేసేవారికేనట. అయితే ఎవరు ఈ కేటగిరీ కిందకి వస్తున్నారో ఇంకా స్పష్టం కాలేదు. రోజుకు 10 గంటల కంటే ఎక్కువ వాయిస్‌ కాల్స్‌ను వాడే వారు ఈ కేటగిరీ కిందకి వస్తారంటూ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ కాల్స్‌పై గరిష్ట పరిమితి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రస్తుతానికి దీనిపై అధికారికంగా ప్రకటన చేయని జియో, త్వరలోనే విధివిధానాలు వెల్లడించనుందట.

No comments

Powered by Blogger.